పైప్ లైన్లే కాని, నీళ్ళు రాని మిషన్ భగీరథ:  చంద్రబాబు

ఇవే తెరాసకు ఆఖరి ఎన్నికలు కావాలని, తెరాసను ఇంటికి పంపాలని  ఏపీ సి ఎం చంద్రబాబునాయుడు అన్నారు.  కోదాడ లో ప్రజాకుటమి అభ్యర్థి ఉత్తమ్ పద్మావతికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ తో కలిసి పాల్గొన్నారు.  కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఒక్కరోజు కూడా సెక్రటేరియట్‌కు వెళ్లలేదని చంద్రబాబు దుయ్యబట్టారు.  దేశం లో ఉన్నవి రెండు కూటములేనని.. భాజపా కూటమిలో ఉంటారా? భాజపాయేతర కూటమిలో ఉంటారా? అని తెరాస, ఎంఐఎంను చంద్రబాబు ప్రశ్నించారు. భాజపాతో కేసీఆర్‌కు సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని ఎంఐఎం నేత అక్బరుద్దీనే పరోక్షంగా ఓ సభలో  చెప్పారని చంద్ర బాబు గుర్తు చేసారు.  మిషన్‌ భగీరథలో పైపులైన్లు మాత్రమే వేశారు తప్ప నీళ్లు రాలేదన్నారు. ఇచ్చిన ఎన్నో హామీలను కేసీఆర్‌ విస్మరించారని విమర్శించారు. అభివృద్ధికి తాను అడ్డుపడ్డానని కేసీఆర్ అంటున్నారని, ఆయన చేసిన ఏ అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుపడ్డానో చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.  తెరాస పాలనలో అన్ని వ్యవస్థలూ గాడితప్పాయని, వాటిని గాడిలో పెట్టాలంటే ప్రజాకూటమికి పట్టం కట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.