ఒకరోజు నిరాహార దీక్షకు సిద్ధమైన మోడీ

విపక్షాల తీరుతో మనస్థాపం చెందిన ప్రధాని మోడీ.. ఒకరోజు నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అయిన మోడీ.. పలు అంశాలపై చర్చించారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరిగిన తీరుపై ప్రధాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పార్లమెంట్‌లో విపక్షాల తీరుపై మనస్తాపం చెందిన ప్రధాని.. విపక్షాల తీరుకు నిరసనగా ఒక రోజు దీక్ష చేయాలని నిర్ణయించారు. బీజేపీ ఎంపీలతో కలిసి ఈనెల 12న నిరాహార దీక్ష చేయనున్నారు. 
ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ తప్పుబట్టింది. పార్లమెంట్‌ ముగిసిన వారం రోజుల తర్వాత నిద్రలేచారంటూ కాంగ్రెస్‌ విమర్శలు గుప్పిస్తోంది. ఏఐఏడీఎంకేతో పాటు వివిధ పక్షాల ఆందోళనలతో రెండో విడత బడ్జెట్‌ సమావేశాల్లో 23 రోజుల పాటు సభా కార్యకలాపాలు స్తంభించాయి. తెలుగుదేశం, వైసీపీ కాంగ్రెస్‌, సీపీఎం తదితర పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి.. అయితే చర్చ జరగకుండా అడ్డుకునేందుకే ఏఐఏడీఎంకే ఎంపీలతో కేంద్రప్రభుత్వమే ఆందోళన చేయించిందని విపక్షాలు ఆరోపించాయి.