మోదీ హ‌వా ఆవిరి

దేశంలో ప్రధాని నరేంద్రమోదీ హవా ఆవిరైపోయిందా ? వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం తప్పదా ? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంచనాలను బట్టి చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. కొద్ది రోజుల నుంచి పార్టీ నాయకులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్న టీడీపీ అధినేత… దేశంలో మోదీ హవా బాగా తగ్గిపోయిందని చెప్పినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటని కొందరు నేతలు చంద్రబాబు ముందు ప్రస్తావించగా… ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి 150 సీట్లు మించిరావనేది చంద్రబాబు అంచనా. గత ఎన్నికలకు ముందు దేశంలో మోదీ హవా ఉంటుందని తాను చెప్పిన విషయం నిజమైందని… బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని తాను విశ్లేషించానని చంద్రబాబు పార్టీ ముఖ్యుల దగ్గర వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు మాత్రం బీజేపీ పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఇదే విషయాన్ని చంద్రబాబు తన పార్టీ నేతలతోనూ నమ్మకంగా చెప్పినట్టు సమాచారం. గతంలో దేశంలో మోదీ హవా ఎక్కువగా ఉందని… కానీ కొన్ని నెలల నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దేశంలో మోదీ హవా తగ్గడం వల్ల కాంగ్రెస్ కంటే ఇతర ప్రాంతీయ పార్టీలకే బాగా కలిసొచ్చే అవకాశం ఉందని… ఈ అవకాశం మనం కూడా వినియోగించుకోవాల్సి ఉంటుందని ఆయన పార్టీ నేతలకు సూచించినట్టు తెలుస్తోంది.

మోదీ హవా తగ్గిందనే విషయం దేశంలోని అన్ని పార్టీల నాయకులకు తెలిసిపోయిందని… కానీ ఈ విషయంలో వైసీపీ మాత్రం మూర్ఖంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు అభిప్రాయపడినట్టు సమాచారం. బీజేపీ మునిగిపోయే నావలాంటిదని… ఆ నావను పట్టుకుని వేలాడితే వైసీపీ కూడా మునిగిపోవడం ఖాయమని టీడీపీ అధినేత అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మోదీ ప్రభావం విషయంలో చంద్రబాబు ఫుల్ క్లారిటీతో ఉన్నట్టు అర్థమవుతోంది.