లగడపాటి సర్వేలో ప్రజాకూటమి దే పై చేయి??

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రజాకూటమిదే ఆధిక్యం అనీ, హస్తం వైపే ప్రజనాడి ఉందనీ, అయితే ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయనేది ఇప్పుడే చెప్పనని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు.  తాను నిర్వహించిన సర్వే ఫలితాలను మంగళవారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు లగడపాటి.  ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజా కూటమికి..వరంగల్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో తెరాసకు ఆధిక్యం ఉందనీ, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో రెండింటికీ పోటాపోటీగా సీట్లు వస్తాయనీ లగడపాటి అన్నారు.  అన్నిటికంటే ఎక్కువ సీట్లు హైదరాబాదు లో ఎంఐఎం గెలుచుకుంటుందనీ, మిగతా సీట్లను భాజపా, ప్రజాకూటమి, తెరాసలు పంచుకుంటాయనీ లగడపాటి తెలిపారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి భాజపాకు సీట్లు పెరుగుతాయనీ, హైదరాబాద్‌ నగరంతోపాటు జిల్లాల్లోనూ భాజపా అభ్యర్థులు గెలుస్తారనీ లగడపాటి అన్నారు.  తమ టీం అక్టోబరు 20వ నుంచి తెలంగాణలోని 100 నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్టు, వివిధ వర్గాలకు చెందిన 1000-1200 మంది అభిప్రాయాలు ఒక్కొక్క నియోజకవర్గంలో సేకరించి శాస్త్రీయంగా సర్వే చేశామన్నారు.  పోలింగ్ శాతాన్ని బట్టి ఫలితాల సరళి మారవచ్చనీ .. అధిక పోలింగ్ శాతం వుంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందన్న అంచనాకు రావచ్చని అయన అభిప్రాయపడ్డారు.  తాను నిస్పక్షపాతంగా ఈ సర్వే నిర్వహించానని లగడపాటి తెలిపారు.