వివాదంలో జనసేన పార్టీ

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకు తీసుకున్న స్థలం లీజుకు సంబంధించి వివాదం ఏర్ప డింది. చినకాకాని పరిధిలో సర్వే నెంబరు 182/1, 181లోని పదెకరాల భూమిలో మూడు ఎకరాలను మూడేళ్ల పాటు యార్లగడ్డ సుబ్బారావు అనే రైతు లీజుకు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ భూమితో యార్లగడ్డ సుబ్బారావుకు సంబంధం లేదని, అది తమ భూమేనని కొంత మంది మైనారిటీలు గురువారం ఈ ప్రాంతానికి వచ్చారు. తమకు సంబంధించిన భూమిని యార్లగడ్డ సుబ్బారావు జనసేన కార్యాలయానికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. విజయవాడకు చెందిన షేక్‌ షఫీ మాట్లాడుతూ.. ఈ స్థలంపై తమకు సర్వ హక్కులు ఉన్నాయని, దీనిపై ఇప్పటికే ఉమ్మడి హైకోర్టులో కేసు నడుస్తుందని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలూ తమ వద్ద ఉన్నాయని, తామే అసలైన వారసులమని చెప్పారు. అంజుమన్‌ ఇస్లామిక్‌ కమిటీ సభ్యులు మాత్రం ఈ విషయంలో పవన్‌కల్యాణ్‌ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ స్థలానికి సంబంధించిన లీజు వ్యవహారంలో ఎలాంటి వివాదమూ లేదని జనసేన పార్టీ నాయకుడు, అప్రెడా రాష్ట్ర కార్యదర్శి గద్దె తిరుపతిరావు తెలిపారు. ఇది కావాలని వైసిపి నేత ఒకరు చేస్తున్న కుట్రగా ఆయన విమర్శించారు.
కుట్రయితే ఎదుర్కొంటాం.. లేకుంటే లీజు రద్దు చేసుకుంటాం.. : పవన్‌ కల్యాణ్‌ 
జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయ స్థలం వివాదంపై ఆపార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ స్పందించి, హైదరాబాద్‌లో గురువారం ప్రకటన విడుదల చేశారు. అవసరమైతే లీజు రద్దు చేసుకుంటామని, వివాదం రాజకీయ కుట్రయితే ఎదుర్కొంటామని పవన్‌ స్పష్టం చేశారు. చట్టం, న్యాయంపై అపార గౌరవం ఉన్న పార్టీ జనసేన అని, స్థలం లీజుపై అంజూమన్‌ ఇస్లామిక్‌ కమిటీ సభ్యుల ఆరోపణలు తన దష్టికి వచ్చాయని తెలిపారు. లీజుకు తీసుకున్న స్థలం వివాదాస్పద స్థలం అయితే వెంటనే లీజును రద్దు చేసుకుంటామన్నారు. ఈనెల 8, 9 తేదీల్లో తాను విజయవాడలోనే ఉన్నానని, అప్పుడే ముస్లిం పెద్దలు ఈ విషయం మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. ఒక ప్రముఖ రాజకీయ నేత సమక్షంలో ఈ అంశంపై మీడియాతో మాట్లాడటం అనుమానించాల్సి వస్తోందన్నారు. ఒక వేళ ఇది రాజ కీయ కుట్ర అయితే తట్టుకునే శక్తి జనసేనకు ఉందన్నారు. త్వరలో న్యాయ నిపుణు లతో కలిసి జనసేన ప్రతినిధులు చినకాకాని వస్తారని తెలిపారు. డాక్యు మెంట్లు వారికి ఇవ్వాలని, ఆ స్థలం మీదే అని నిర్ధారణ అయితే, ఆ మరు క్షణమే జనసేన సదరు స్థలానికి దూరంగా ఉంటుందని పవన్‌ కల్యాణ్‌ హామీ వివరించారు.