విజయవాడ నుంచి మొదటిఅంతర్జాతీయ విమానం టేక్ ఆఫ్: ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ టెర్మినల్‌ భవనానికి భూమిపూజతో పాటు సింగపూర్‌ విమాన సర్వీసును మంగళవారం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పౌరవిమానయాన శాఖ మంత్రి సురేష్‌ప్రభుతో కలిసి ప్రారంభించారు. సింగపూర్‌ నుంచి బయలుదేరిన విమానం.. మధ్యాహ్నం మూడున్నరకు గన్నవరం చేరుకుంది. ఇక్కడినుంచి ప్రారంభమైన సర్వీసులో 87 మంది సింగపూర్‌ వెళ్లారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఏర్పాటుచేసిన సభలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకల్లో విజయవాడకు స్థానం దక్కడం ఆనందదాయకమని అన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విమానాశ్రయాలలో  రూ.611 కోట్లతో అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేయడం దేశంలోనే ప్రథమమని అయన అన్నారు. కేంద్రం కృషితోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రద్ధ చూపడంతోనే అంతర్జాతీయ కల సాకారమైందని అన్నారు. విమానయాన సంస్థలు ముందుకు వచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌ను సమకూర్చారని, అన్నీ ప్రభుత్వాలు చేయబోవని, ప్రైవేటురంగం కూడా ముందుకు వచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అయన అన్నారు. సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభం కావడం ఆరంభమేనని, భవిష్యత్తులో మరిన్ని సర్వీసులు వస్తాయని, రాష్ట్రంలో ప్రస్తుతానికి విజయవాడ, విశాఖ విమానాశ్రయాలలో అంతర్జాతీయ సర్వీసులు నడుస్తున్నాయని, రాజమహేంద్రవరం, కడప కూడా వీటి సరసన చేరుతాయని ఉపరాష్ట్రపతి తెలిపారు.  కార్గో ద్వారా అమరావతి ప్రాంతం నుంచి మామిడి, మిర్చి, వేరుసెనగ వంటి ఉత్పత్తులు విదేశాలకు పంపించే వీలు కలుగుతుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో సురేష్ ప్రభు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తోపాటు పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా, మంత్రులు యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర, ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నాని, గోకరాజు గంగరాజు, మాగంటి బాబు, అధికారులు పాల్గొన్నారు.